“REMEMBER”: కోవిడ్ 19 మహమ్మారి సమయంలో పిల్లలతో జీవించడం!

Hesham Hamoda, MD, MPH
Staff Psychiatrist, Boston Children’s Hospital
Assistant Professor, Harvard Medical School

Illustrations by: Dr. Serag Eldin Kamel

Translated by: Dr Lakshmi Sravanti MD, (DM)
Bengaluru, India

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చే 135 దేశాలలో కోవిడ్-19 (COVID-19) మహమ్మారి కేసులు నివేదించడంతో (మరింత విస్తరించే అవకాశం ఉంది), ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో లక్షలాది మంది పిల్లల జీవితాలు ప్రభావితమయ్యాయి.
మీరు ఈ వార్తతో భయభీతి చెందుతున్నారు? ఇందులో మీరు ఒంటరి గా లేరు! ఈ క్లిష్ట సమయాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు మద్దతు ఇవ్వగల కొన్ని సులభమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి. మీరు ఈ “REMEMBER” అనే పదాన్ని ఉపయోగించవచ్చు. 

1. Reassure them (వారికి భరోసా ఇవ్వండి): నిజం చెప్పండి, కానీ మీరు వారి కోసం వారితో ఉంటారని మరియు మీరు వారిని సురక్షితంగా ఉంచుతారని కూడా వారికి తెలియజేయండి. అదృష్టవశాత్తూ, ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారికి తేలికపాటి అనారోగ్యం మాత్రమే వస్తుందని సూచిస్తుంది.

2. Empower them (వారిని శక్తి పరచండి): ఇతరులను జాగ్రత్తగా చూసుకోవటానికి వారికి ఇది ఒక అవకాశం లభించింది. మరియు ఇది వారికి సమాజం గురించి ఆలోచించే అవకాశం కూడా. వారు కృతజ్ఞతా పత్రాలు వ్రాయవచ్చు (తరువాత అందించచ్చు) లేదా ఆరోగ్య కార్యకర్తలకు ఇమెయిల్ చేయవచ్చు. వారు సహాయక చర్యలకు విరాళం ఇవ్వవచ్చు. ఇరుగు పొరుగు లో ఉన్న వృద్ధ వారికి ఫోన్ చేసి వారి పరిస్థితి గురించి విచారించవచ్చు లేదా వారి తలుపు కింద నుండి ఒక గమనిక పంపవచ్చు.

3. Maintain your own calm (మీ స్వంత ప్రశాంతతను కాపాడుకోండి): మొదట మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి! పిల్లలు మీరు చేసేది చేస్తారు, మీరు చెప్పేది కాదు. మీ ఒత్తిడిని జాగ్రత్తగా చూసుకోవటానికి మరియు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటానికి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

4. Engage them (వారిని చురుకుగా ఉంచండి): ఇంట్లో కుటుంబంతో మంచి సమయం గడపడానికి ఇది ఒక అవకాశం! వారిని బిజీగా ఉంచండి, వారితో బోర్డు ఆటలు ఆడండి, సినిమాలు చూడవచ్చు లేదా కలిసి వంట వండవచ్చు, వీలైతే, కుటుంబ సభ్యులందరూ కలిసి ఆరోగ్యంగా ఉండటానికి కలిసి నృత్యం చేయవచ్చు.

5. Manage their emotions (వారి భావోద్వేగాలను నిర్వహించండి): ప్రశ్నలు అడగడానికి, అంటువ్యాధి గురించి వారి భావాలను మరియు అది వారిని ఎలా ప్రభావితం చేస్తుందో చర్చించడానికి వారికి అవకాశం ఇవ్వండి. పాఠశాల మూసివేత కారణంగా వారు తమ స్నేహితులను మరియు సాధారణ దినచర్యను కోల్పోతే ఇది మరింత ముఖ్యం. పిల్లలకు అన్ని సమాధానాలు లేనప్పటికీ, మీరు వారి మాటలు వింటారని హామీ ఇవ్వండి. లోతైన శ్వాస (deep breathing) మరియు ధ్యానం (meditation) వంటి సడలింపు పద్ధతులను వారికి నేర్పడానికి ఇది ఒక అవకాశం కావచ్చు.

6. Beware (జాగ్రత్తగా ఉండండి): ఎక్కువసేపు మీడియాను చూడటం పిల్లలపై భారం అవ్వచ్చు మరియు మీడియాలో చూపిన సమాచారం అంతా ఎప్పుడూ సరైనది కాకపోవచ్చు.

7. Educate them (వారికి అవగాహన కల్పించండి): తరచుగా చేతులు కడుక్కోవడం (hand hygiene) మరియు దగ్గు వస్తే కప్పుకోవడం లాంటి మంచి పద్ధతులపై వారికి అవగాహన కల్పించడానికి ఇది ఒక అవకాశం. విజ్ఞానం పట్ల ఆసక్తిని పొందడానికి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు – “ఈ వ్యాధికి వ్యాక్సిన్ కోసం శోధిస్తున్న శాస్త్రవేత్తకు ఇది ఎంత అద్భుతమైన విషయం?”, “అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నర్సులు ఎంత అద్భుతంగా సేవ చేస్తున్నారు”, “ఈ రోజుల్లో మనందరినీ సురక్షితంగా ఉంచడంలో స్కావెంజర్స్ పని ఎంత ముఖ్యమో మీరు ఆలోచించగలరా?”.

8. Routines (దినచర్య): మీకు వీలైనంత వరకు దినచర్యను అనుసరించండి. మీరు కుటుంబంతో కలిసి భోజనం చేయడం, పడుకునేటప్పుడు పిల్లలకి కథలు చదవడం, పిల్లలతో సినిమాలు చూడటం మొదలైనవి చేయవచ్చు. పిల్లలు ఇంట్లో కొంత వ్యాయామం చేసి, రోజూ నీరు త్రాగాలని మర్చిపోవద్దు. వీలైతే, మీ ఇంటిలో లేదా మీ ఇంటి ప్రాంగణంలో స్వచ్ఛమైన గాలిని పొందండి!